కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు షాకిచ్చింది. ఎఫ్‌డీఐ పాలసీని సవరించింది. దీంతో భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీలు మన సంస్థల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. ఆటోమేటిక్ మార్గంలో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాలు వెల్లడించింది. దీనికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పాలసీకి సవరణలు చేసింది.
సాధారణంగా భారత్‌లో ఎఫ్‌డీఐలకు రెండు రకాల అనుమతులు ఉన్నాయి. ఒకటేమో ఆటోమేటిక్ మార్గం. ఇందులో కంపెనీలకు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. రెండోదేమో ప్రభుత్వ మార్గం. ఇందులో కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం.
అయితే ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో దేశీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి కంపెనీల మీద విదేశీ సంస్థలు కన్నేశాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తమ వాటాను పెంచుకోవాలని.. లేదంటే ఏకమొత్తంగా కొనుగోలు చేసి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీల కొనుగోలును నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఎఫ్‌డీఐ రూల్స్‌ను సవరించింది. భారత్ సరిహద్దు దేశాలు ప్రత్యేకించి చైనాకు చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.